New Delhi: ఇది సినిమా స్టోరీ కాదు.. యువతిని వేశ్యాగృహానికి అమ్మేసిన స్నేహితురాలు.. విటుడి సాయంతో బయటపడిన వైనం!

  • ఉద్యోగం కోసం ఢిల్లీ రప్పించిన స్నేహితురాలు
  • నమ్మి వెళ్తే వ్యభిచార గృహానికి అమ్మేసిన వైనం
  • విషయం బాధితురాలి సోదరుడికి చెప్పిన విటుడు

సినిమా స్టోరీని తలపించే నిజ జీవిత గాధ ఇది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ఓ స్నేహితురాలు ఆమెను వ్యభిచార గృహానికి అమ్మేస్తే.. ఆమె వద్దకు వచ్చిన విటుడు ఆమె కథ విని కరిగిపోయాడు. ఆ నరక కూపం నుంచి ఆమెను బయటపడేస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన 27 ఏళ్ల బాధితురాలు కోల్‌కతాలో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ జీవించేది. ఈ క్రమంలో పరిచయమైన ఓ మహిళ మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఢిల్లీకి రప్పించింది. ఆమె మాటలు నమ్మిన బాధితురాలు కష్టాలు తీరిపోతాయన్న గంపెడాశతో జూన్‌లో దేశ రాజధానికి బయలుదేరింది. స్నేహితురాలిని కలిశాక ఆమె ఓ వ్యక్తిని బాధితురాలికి పరిచయం చేసింది. ఆఫీసుకు తీసుకెళ్తున్నట్టు నమ్మించిన ఆమెను నేరుగా జీబీ రోడ్డుకు తీసుకెళ్లి ఆమె వద్ద వున్న ఫోన్ లాక్కుని అక్కడే ఉన్న ఓ వేశ్యా గృహానికి అమ్మేశాడు.

వేశ్యాగృహంలో చిక్కుకున్న బాధితురాలికి అక్కడి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. వారు పెట్టే చిత్ర హింసలు భరించి సమయం కోసం వేచి చూడసాగింది. ఇటీవల ఆమె వద్దకు వచ్చిన ఓ విటుడి వద్ద తన గోడు వెళ్లబోసుకుని కన్నీరు పెట్టుకుంది. ఆమె చెప్పింది విన్న విటుడి మనసు కరిగిపోయింది. బాధితురాలి సోదరుడి ఫోన్ నంబరు తీసుకుని బయటపడ్డాడు. ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అప్పటికే ఆమెపై సోదరుడు అదృశ్యం కేసు పెట్టాడు.

విటుడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలోని జీబీ రోడ్డుకు చేరుకున్న బాధితురాలి సోదరుడు ఆమె అక్కడే ఉందని ధ్రువీకరించుకున్నాడు. వెంటనే వెళ్లి పోలీసులను కలిసి విషయం చెప్పాడు. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యభిచార గృహంపై దాడి చేసి బాధితురాలిని రక్షించారు. బాధితురాలిని వ్యభిచార గృహానికి అమ్మేసిన మహిళ, ఆమె పరిచయం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహానికి తాళం వేసి నిర్వాహకులకు అరదండాలు వేశారు.

More Telugu News