Peddapalli: అప్పుల బాధతో గోదావరిలో దూకి, ప్రాణభయంతో పిల్లర్ ను పట్టుకు వేలాడిన వ్యక్తి... గంటన్నర ఉత్కంఠ!

  • పెద్దపల్లి బ్యాంకులో పనిచేస్తున్న రాజమౌళి
  • అప్పులు అధికమై ఆత్మహత్యాయత్నం
  • కాపాడిన పోలీసులు, ఫైర్ సిబ్బంది

అప్పుల బాధను తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి గోదావరి నదిలో దూకి, ఆపై ప్రాణభయంతో తనకు అందిన పిల్లర్ రాడ్ ను పట్టుకుని వేలాడుతుండగా, గంటన్నర పాటు హైడ్రామా అనంతరం పోలీసులు, ఫైర్ సిబ్బంది అతని ప్రాణాలను కాపాడారు.

వివరాల్లోకి వెళితే, పెద్దపల్లిలోని ఓ బ్యాంకులో పని చేస్తున్న రామగుండం, ఎన్టీపీసీకి చెందిన రాచపల్లి రాజమౌళి అనే ఉద్యోగి అప్పులు అధికంగా చేసి, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గోదావరి ఖని సమీపంలోని నదిలో దూకాడు.  ఆవెంటనే ప్రాణాలు పోతాయన్న భయం అతన్ని ఆవరించగా, తనకు దొరికిన ఓ రాడ్డును పట్టుకుని వేలాడుతూ, కేకలు పెట్టాడు. ఈలోగా అటుగా వస్తున్న స్థానికులు అతన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో గంటన్నర పాటు శ్రమించి, తాళ్ల సాయంతో అతన్ని కాపాడారు. ఆపై పడవ ద్వారా ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు బ్రిడ్జ్ వద్దకు చేరుకుని, రాజమౌళిని ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News