Sonia Gandhi: సోనియా ఈజ్ బ్యాక్... మరోసారి కాంగ్రెస్ పగ్గాలు!

  • రెండున్నర నెలల ఉత్కంఠకు తెర
  • తదుపరి చీఫ్ ను ఎన్నుకునే వరకూ సోనియాకు బాధ్యతలు
  • శనివారం రాత్రి 11 సమయంలో ప్రకటన

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని సరిదిద్దేందుకు ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండున్నర నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరచెబుతూ, పార్టీ నూతన అధ్యక్షురాలిగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీని ఎంపిక చేస్తున్నట్టు గత రాత్రి 11 గంటలకు తీర్మానం చేసింది. తదుపరి పార్టీ చీఫ్‌ ను ఎన్నుకునేంత వరకూ సోనియా బాధ్యతలు నిర్వర్తిస్తారని సీడబ్ల్యూసీ పేర్కొంది.

కాగా, ఢిల్లీలో జరిగిన ఈ భేటీ నాటకీయ పరిణామాల మధ్య సాగింది. తొలుత ఉదయం భేటీ అయిన సీడబ్ల్యూసీ పెద్దలు, రాహుల్ కాకుంటే, సోనియా మినహా మరో వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎంపిక చేసేందుకు ససేమిరా అనడంతో, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రాత్రికి వాయిదా పడింది. తర్వాత రెండోసారి రాత్రి 9 గంటల సమయంలో మరోసారి సీడబ్ల్యూసీ భేటీ జరుగగా, పదవిని చేపట్టేందుకు సోనియా అంగీకరించారు.

ఆ వెంటనే రాహుల్‌ గాంధీ చేసిన రాజీనామాను ఆమోదిస్తున్నామని, పార్టీ నియమావళిని అనుసరించి సోనియాను తాత్కాలిక చీఫ్‌ గా నియమించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించినట్టు పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ వెల్లడించారు. కాగా, 2017 డిసెంబర్ లో పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్, ఈ సంవత్సరం మే 25న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News