ajoy kumar: కాంగ్రెస్‌కు మరో షాక్.. జార్ఖండ్ పీసీసీ చీఫ్ గుడ్‌బై!

  • పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు
  • వారికంటే కరుడుగట్టిన నేరస్తులు నయమన్న అజోయ్
  • రాహుల్ గాంధీకి మూడు పేజీల లేఖ

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జార్ఖండ్ చీఫ్ అజోయ్ కుమార్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని, స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. వారికంటే కరుడుగట్టిన నేరస్తులు చాలా నయమన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి మూడు పేజీల రాజీనామా లేఖను పంపారు.

పార్టీలోని కొందరు నాయకులు స్వప్రయోజనాల కోసం తమ ఆలోచనలను పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను రాజీనామా చేయడానికి కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్, రామేశ్వర్ ఒరయాన్, మాజీ ఎంపీలు చంద్రశేఖర్ దూబే, ఫర్ఖాన్ అన్సారీ, పీసీసీ మాజీ చీఫ్ ప్రదీప్ బాల్‌ముచ్చు వంటి నేతలే కారణమని అజోయ్ కుమార్ ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వీరంతా పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. అవినీతిని తాను అస్సలు సహించబోనని, అది ఏ రూపంలో ఉన్నా తాను అడ్డుకుంటానని అన్నారు. ఇది తన పదవికి అడ్డంకిగా మారిందని, కాబట్టి దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో కోరారు.

More Telugu News