ketireddy jagadeeswarreddy: 'బిగ్‌బాస్-3' షోలో అశ్లీలత, అసభ్యత వున్నాయంటూ ఏపీ హైకోర్టులో పిల్

  • స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న షో
  • నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన కేతిరెడ్డి
  • ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్-3 షోలో అశ్లీలత, అసభ్యత రాజ్యమేలుతోందని, హింసను ప్రోత్సహించేదిగా ఉందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండా ప్రసారం చేయడం వల్ల యువత, చిన్నారులపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ పిల్ దాఖలు చేశారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ సెంట్రల్‌ బోర్డు చైర్‌పర్సన్‌, ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫౌండేషన్‌, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితరులను కేతిరెడ్డి తన వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ షోపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని కేతిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. షో కోసం జరిగిన ఎంపికల సందర్భంగా తాము వేధింపులు ఎదుర్కొన్నట్టు ఇద్దరు యువతులు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లో కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో షో ప్రసారం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

More Telugu News