370 article: పుల్వామా దాడికి పాకిస్థాన్‌ కారణమని ఇమ్రాన్‌ ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు : శివసేన

  • వారి ప్రమేయం ఉందనేందుకు ఆయన వ్యాఖ్యలే సాక్ష్యం
  • పార్టీ పత్రిక సామ్నాలో దాయాదిపై తీవ్రస్థాయిలో ధ్వజం
  • పాకిస్థాన్‌ వాణిజ్య నిర్ణయాలతో భారత్‌కు వచ్చిన నష్టం లేదని వ్యాఖ్య

పుల్వామా దాడి తమ ప్రమేయంతోనే జరిగిందని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పకనే చెప్పారని శివసేన వ్యాఖ్యానించింది.  కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణను రద్దు చేయడం వల్ల కశ్మీర్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులు జరగవచ్చని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన అధికార పత్రిక సామ్నా చర్చిస్తూ 40 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న దాడి వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని ప్రధాని వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయన్నారు.

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కుదించుకోవడం, వాణిజ్య బంధాన్ని తెంచుకోవడం ద్వారా పాకిస్థాన్‌ తన కంటిని తానే పొడుచుకుంటోందని, దీనివల్ల ఆ దేశానికే తప్ప భారత్‌కు వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొంది. భారత్‌ హైకమిషనర్‌ను బహిష్కరించి, తమ హైకమిషనర్‌ను పంపకూడదన్న పాకిస్థాన్‌ నిర్ణయాన్ని శివసేన స్వాగతించింది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల చేతుల్లో ఆ దేశ హైకమిషనర్‌ ఓ కీలుబొమ్మని, అలాంటి వారి వల్ల ఏం దౌత్యం కొనసాగుతుందని వ్యాఖ్యానించింది.

More Telugu News