Rahul Gandhi: కేరళకు అన్ని రకాలుగా సాయం చేస్తామని మోదీ చెప్పారు: రాహుల్ గాంధీ

  • కేరళపై పంజా విసిరిన భారీ వర్షాలు
  • చిగురుటాకులా వణుకుతున్న వయనాడ్ జిల్లా
  • సహాయక చర్యలు తీసుకోవాలని మోదీని కోరిన రాహుల్

భారీ వర్షాల ధాటికి కేరళ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ కార్యకర్తలు వయనాడ్ జిల్లాకు వెళ్లి, వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

ప్రధాని మోదీతో తాను మాట్లాడానని... వరద బీభత్సం సృష్టిస్తున్న ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలను తీసుకోవాలని కోరానని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని చెప్పారని అన్నారు.

కేరళలో వరద సరిస్థితిని తాను నిశితంగా గమనిస్తున్నానని రాహుల్ తెలిపారు. సహాయక, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేసే విషయంపై కేరళ ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో మాట్లాడానని చెప్పారు.

ఇదిలా వుంచితే, వరద బీభత్సంతో కేరళలో ఇప్పటికే 17 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వయనాడ్ లోని ఓ టీ ఎస్టేట్ నిన్న సాయంత్రం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో 200 మంది గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టుగా భావిస్తున్నారు.

More Telugu News