Kochi: నీట మునిగిన కొచ్చి విమానాశ్రయం... అన్ని విమానాలు బంద్... ప్రయాణికుల గగ్గోలు!

  • ఉప్పొంగిన పెరియార్ నది
  • ఆదివారం వరకూ సర్వీసుల నిలిపివేత
  • రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు

కేరళలోని కొచ్చి విమానాశ్రయం నీట మునిగింది. ఇటీవలి భారీ వర్షాలకు విమానాశ్రయం పక్కనే ప్రవహించే పెరియార్ నది ఉప్పొంగడంతో రన్ వే పైకి భారీగా వరదనీరు చేరింది. విమానాల టేకాఫ్ కు గానీ, ల్యాండింగ్ కు గానీ అవకాశం లేకపోవడంతో, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ అన్ని విమాన సర్వీసులనూ రద్దు చేస్తున్నట్టు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.

ఆపై పరిస్థితిని బట్టి, సర్వీసులు ఎప్పటినుంచి ప్రారంభించాలన్నది నిర్ణయిస్తామన్నారు. దీంతో కొచ్చి నుంచి బయలుదేరే విమానాలు ఎక్కాల్సిన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్, ఖతార్, సింగపూర్ లతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాలకు అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన వారు ఇబ్బందులకు గురయ్యారు. పలువురు కొచ్చి ఎయిర్ పోర్టు నుంచి తిరువనంతపురంకు టాక్సీలు బుక్ చేసుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో టాక్సీవాలాలు ధరలు పెంచేశారు.

 కాగా, కేరళలోని పలు పట్టణాలు భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నీటి ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో, ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది.

More Telugu News