BJP: నేడు బీజేపీలో చేరనున్న వివేక్.. మరో ముగ్గురు కూడా?

  • నేడు ఢిల్లీ వెళ్లనున్న వివేక్, కె.లక్ష్మణ్
  • అమిత్ షా అపాయింట్‌మెంట్ లభిస్తే నేడే కాషాయ తీర్థం
  • క్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మోత్కుపల్లి

తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు జి.వివేక్‌తోపాటు మరో ముగ్గురు సీనియర్ నేతలు నేడు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. నేడు ఢిల్లీ వెళ్తున్న వీరు అమిత్ షా అపాయింట్‌మెంట్ లభిస్తే ఆయన సమక్షంలో కాషాయం తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కలిసిన వివేక్ పార్టీలో చేరిక విషయమై దాదాపు గంటపాటు చర్చించినట్టు తెలుస్తోంది. నేడు లక్ష్మణ్ కూడా ఢిల్లీ వెళ్లనుండడంతో వివేక్ బీజేపీలో చేరిక వార్తలకు బలం చేకూరింది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇటీవల వివేక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే, ఇప్పటికే అమిత్‌ షా, రాంమాధవ్‌లతో మూడుసార్లు భేటీ అయిన వివేక్ బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అంతేకాదు, రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కానీ కోరినట్టు సమాచారం.

అధిష్ఠానం వివేక్‌కు ఎటువంటి హామీ ఇవ్వకపోయినా కలిసి పనిచేద్దామని లక్ష్మణ్-వివేక్ నిర్ణయించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా, మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.  

More Telugu News