Bollywood: భారతీయ సినిమాలపై నిషేధం విధించిన పాకిస్థాన్!

  • ఆర్టికల్ 370 రద్దుపై గుర్రుగా ఉన్న పాక్
  • దౌత్య, వాణిజ్య సంబంధాలు కట్
  • భారీగా ఆదాయం కోల్పోనున్న పాక్ థియేటర్లు

జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు పాకిస్థాన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పాక్ లో భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది. తాజాగా భారత సినిమాలను తమ దేశంలో ప్రదర్శించకుండా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది.

ప్రస్తుతం ప్రదర్శిస్తున్న బాలీవుడ్ సినిమాలను వెంటనే నిలిపివేయాలనీ, అలాగే కొత్త సినిమాలను కూడా తాము అనుమతించబోమని పాక్ ప్రధాని ప్రత్యేక సహాయకుడు డా. ఫిరదౌస్ అషిక్ అవాన్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాక్ లోని జైషే ఉగ్రవాద స్థావరంపై భారత్ దాడిచేయడంతో పాక్ భారత సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించింది.

పాక్ థియేటర్లకు 70 శాతం ఆదాయం భారతీయ సినిమాల ద్వారానే వస్తోంది. గతేడాది అక్కడ 21 పాకిస్థానీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఒక్కో బాలీవుడ్ సినిమా పాక్ లో రూ.3 నుంచి 4 కోట్ల వరకూ అర్జిస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా రూ.37 కోట్ల కలెక్షన్ తో పాకిస్థాన్ లో టాప్ గా నిలిచింది.

More Telugu News