Praneet Kaur: పంజాబ్ సీఎం భార్యకు టోకరా... రూ. 23 లక్షలు నొక్కేసిన నేరగాళ్లు!

  • జీతం డిపాజిట్ అయ్యే వివరాలు కావాలని ఫోన్
  • నమ్మి చెప్పిన ప్రణీత్ కౌర్
  • నిమిషాల్లో లక్షలు స్వాహా

బ్యాంకు ఖాతాల వివరాలు, మొబైల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్లను ఎవరికీ తెలియజేయరాదని ఎంతగా ప్రచారం చేస్తున్నా కొందరు మోసపోతూనే ఉన్నారు. వారిలో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం. తాజాగా, పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ భార్య, ఎంపీ ప్రణీత్‌ కౌర్‌ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 23 లక్షలను పోగొట్టుకున్నారు. తాను ఓ బ్యాంకు మేనేజర్‌ నని ఆగంతకుడు ఫోన్ చేస్తే, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పిన ఆమె అడ్డంగా బుక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే, పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే హడావుడిలో ఉండగా, తానో బ్యాంకు మేనేజర్‌ నని, ఎంపీ జీతం డిపాజిట్‌ అయ్యే ఖాతా వివరాల అప్‌ డేట్‌ కోసమే ఫోన్ చేశానని చెప్పాడు. ఈ మాటలు నమ్మిన ఆమె, తన ఖాతా సంఖ్య, ఏటీఎం పిన్‌, సీవీసీ వివరాలను చెప్పారు. దీంతో ఆ వివరాలు తీసుకుని, ఫోన్ నంబర్ ను కన్ఫర్మ్ చేసుకునేందుకు ఓ ఓటీపీ వస్తుందని, దాన్ని చెప్పాలని కోరగా, ఆమె ఓటీపీ చెప్పారు. ఆపై నిమిషాల వ్యవధిలో ఖాతా నుంచి రూ. 23 లక్షలు డ్రా అయినట్టు మెసేజ్ రావడంతో అవాక్కైన ప్రణీత్ కౌర్, పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు చేసిన మహిళ, సీఎం భార్య కావడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, మోసం చేసిన వ్యక్తి జార్ఖండ్‌ కు చెందినవాడని గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ నిమిత్తం పంజాబ్‌ తీసుకువస్తున్నామని తెలిపారు.

More Telugu News