Article 370: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న అముల్ డెయిరీ

  • జమ్ముకశ్మీర్, లడఖ్ లలో కార్యకలాపాల విస్తరణ
  • జమ్ము, శ్రీనగర్ లలో ఐస్ క్రీం, పన్నీర్ ప్లాంట్ల ఏర్పాటు
  • డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా రైతులకు ప్రోత్సాహం

జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్టికల్ రద్దైతే... రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఆయన చెప్పిన మాటలకు రెండు రోజుల్లోనే తొలి ఫలితం వచ్చింది.

జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని అముల్ డెయిరీ ప్రకటించింది. ఇప్పటికే జమ్ముకశ్మీర్ పాల ఉత్పత్తిదారుల సంఘం పేరుతో అక్కడ డెయిరీని అముల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రోజుకు లక్ష లీటర్ల అముల్ పాలను ఈ డెయిరీ సరఫరా చేస్తోంది. త్వరలోనే దీన్ని 5 లక్షల లీటర్లకు పెంచాలని తాజాగా నిర్ణయించింది. 2024-25 నాటికి పాల సేకరణను 180 లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో ఐస్ క్రీం, పన్నీర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా రైతులను ప్రోత్సహించి పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

More Telugu News