Hyderabad: బెట్టింగ్ భూతానికి హైదరాబాద్ యువకుడి బలి!

  • హైదరాబాద్ లోని బోరబండలో ఘటన
  • బెట్టింగ్ కు బానిసైన రవికుమార్
  • బుకీలకు ఏకంగా రూ.80 వేలు అప్పు

క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఓ కుటుంబం ఛిద్రమైపోయింది. అప్పు చెల్లించాలని క్రికెట్ బుకీ వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ కు  చెందిన బోరబండలో చోటుచేసుకుంది. బోరబండకు చెందిన రవికుమార్ స్థానికంగా ఓ కాలేజీలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో అక్కడే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే రాజశేఖర్ తో రవికుమార్ కు పరిచయం ఏర్పడింది.

దీంతో క్రమంగా బెట్టింగ్ కు అలవాటుపడ్డ రవికుమార్, అప్పులు చేసి మరీ బెట్టింగ్ కట్టడం మొదలుపెట్టాడు. ఇలా రాజశేఖర్ కు రూ.80,000 వరకూ రవికుమార్ అప్పుపడ్డాడు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకపోవడంతో బుకీ రాజశేఖర్ నేరుగా అతని ఇంటికే వచ్చేశాడు. అప్పు ఎప్పుడు తీరుస్తున్నావ్? అని అడిగాడు. దీంతో రవికుమార్ తండ్రి విష్ణుమూర్తి తన పొలం అమ్మేసి రూ.40,000 కట్టారు.

కానీ ఇంకా రూ.40 వేలు ఇవ్వాలని రాజశేఖర్ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీంతో తీవ్రమనస్తాపానికి లోనైన రవికుమార్, తన వల్లే కుటుంబానికి ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన చెందాడు. ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు రాజశేఖర్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ లో రాశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News