Maharashtra: తెలంగాణలో మహారాష్ట్ర పోలీసుల వీరంగం... అరెస్టు.. విడుదల!

  • కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన మహారాష్ట్ర పోలీసులు
  • తమ పశువులను తెచ్చారంటూ సంతలో బాహాబాహీ
  • అరెస్ట్ తరువాత వచ్చి విడిపించుకెళ్లిన మహారాష్ట్ర అధికారులు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన మహారాష్ట్ర పోలీసులు, సంతలో వీరంగమాడటంతో, తెలంగాణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, మద్యం తాగి, గణేశ్ పూర్ సంతకు వచ్చిన మహారాష్ట్ర ఎస్ఐ, కానిస్టేబుల్, అమ్మకందారులపై దాడికి దిగారు. తమ రాష్ట్రం నుంచి పశువులను అక్రమంగా తెచ్చారని దూషించారు. చంద్రపూర్ జిల్లాకు చెందిన ఎస్ఐ విజయ్ సింగ్, తుపాకిని బయటకు తీసి, కాల్చివేస్తానని బెదిరింపులకు దిగారు. తనతో ఉన్న కానిస్టేబుల్ తో వ్యాపారులపై దాడి చేయించాడు.

విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లగా, వారితోనూ గొడవ పడ్డారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మహారాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆపై పోలీసు స్టేషన్ కు వచ్చిన చంద్రాపూర్ సీఐ, విజయ్ సింగ్ ను మందలించి, మరోసారి ఈ తరహా ఘటనలు జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి, విడిపించుకుని వెళ్లారు.

More Telugu News