america: మేం అన్నీ గమనిస్తూనే ఉన్నాం... పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

  • భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలను తెంచుకున్న పాక్
  • చొరబాటుదార్లకు సహకారం అందిస్తే బాగుండదని అమెరికా హెచ్చరిక
  • ఉద్రిక్తతలు చల్లబరిచే చర్యలు చేపట్టాలని సూచన

ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్ తమకేమీ చెప్పలేదన్న అమెరికా.. తాజాగా పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌తో దౌత్య సంబంధాలు, వాణిజ్యం విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటన నేపథ్యంలో.. సంయమనం పాటించాలని సూచించింది. చొరబాట్లను సహించబోమని హెచ్చరించింది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపాలని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది.

 ‘‘జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడాన్ని మేం జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఈ చర్యల వల్ల రెండు దేశాల సరిహద్దులో మరిన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. అంతేకాదు, ఈ ప్రాంతంలో అస్థిరత కూడా ఎక్కువవుతుంది’’ అని అమెరికా అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దక్షిణాసియా మిలటరీ మోహరింపులను నిరోధించాలంటే అత్యవసరంగా ఈ రెండు దేశాలు చర్చల్లో కూర్చోవాలని పేర్కొన్నారు.  

పాకిస్థాన్ కూడా దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, నియంత్రణ రేఖ వద్ద చొరబాటుదార్లకు సహకారం అందించడం మానుకోవాలని సెనేటర్ రోబెర్ట్ మెనెండెస్, కాంగ్రెస్ సభ్యుడు ఇలియన్ ఎంగెల్ హెచ్చరించారు. అంతేకాదు, పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News