Chetan bhagat: చేతన్ భగత్ కు ఆయన రాసిన పుస్తకం పైరసీ కాపీని అమ్మిన కుర్రాడు.. వీడియో వైరల్!

  • రచయిత చేతన్ భగత్ కు వింత అనుభవం
  • ఆయన నవలనే పైరసీ చేసి అమ్ముతున్న కుర్రాడు
  • ట్విట్టర్ లో స్పందించిన చేతన్

పుస్తకాలు, సినిమాలు, పాటలు, కళాఖండాలు.. ఇలా అన్నీ ప్రస్తుతం పైరసీకి గురవుతున్నాయి. చాలామంది కేటుగాళ్లు వీటి డూప్లికేట్లు తయారుచేసి అమ్మేస్తున్నారు. అయితే పైరసీకి గురైన తమ ఉత్పత్తులను కొనాల్సి వస్తే సదరు రచయితలు, ఓనర్ల ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇలాంటి విచిత్రమైన అనుభవం ప్రముఖ భారత ఆంగ్ల నవలా రచయిత చేతన్ భగత్ కు ఎదురైంది. చేతన్ భగత్ కారులో వెళుతుండగా సూరజ్ అనే ఓ పిల్లాడు పుస్తకాలు అమ్ముకుంటూ కారు దగ్గరకు వచ్చాడు. దీంతో చేతన్..‘నీ దగ్గర చేతన్ భగత్ పుస్తకాలు ఉన్నాయా? అతను బాగా రాస్తాడా? ఏది ఓ పుస్తకం చూపించు’ అని అడిగారు.

దీంతో ఆ పిల్లాడు ‘ఇదిగోండి సార్.. తీసుకోండి. ఈ నవల చాలా బాగుంటుంది’ అని ఓ పైరేటెడ్ కాపీని అందించాడు. దీంతో చేతన్ స్పందిస్తూ..‘ఇది పైరసీ చేసిన బుక్ కదా’ అనగానే, సూరజ్ ‘ఇది ఆన్ లైన్ కాపీ సార్’ అని జవాబిచ్చాడు. అప్పటివరకూ నవ్వును ఆపుకున్న చేతన్ భగత్..‘నేనే చేతన్ భగత్ ను. మీరూ బాగా అమ్ముతున్నారు. థ్యాంక్యూ’ అని పుస్తకాన్ని కొనుక్కున్న చేతన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్న చేతన్..‘నేను పైరసీని ప్రోత్సహించను. కానీ ఇలాంటి పుస్తకాల వల్ల సూరజ్ లాంటి యువకుల పొట్ట నిండుతోంది’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయమై చేతన్ స్పష్టత ఇవ్వలేదు.

More Telugu News