India: ‘హువావే’పై నిషేధం విధించారో.. మీ కంపెనీలకు చుక్కలు చూపిస్తాం!: భారత్ కు చైనా హెచ్చరిక

  • భారత్ లో త్వరలో 5జీ టెక్నాలజీ
  • చైనా కంపెనీ హువావేను అనుమతించబోరని వార్తలు
  • భారత కంపెనీలపై ప్రతీకార చర్యలు తప్పవన్న చైనా

చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ హువావేపై అమెరికా ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి, తమ ఆంక్షలను కాదని హువావే ఇరాన్, ఉత్తరకొరియాలకు మొబైల్, త్రీజీ టెక్నాలజీ పరికరాలను సరఫరా చేయడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో భారత్ లో త్వరలో ప్రారంభం కానున్న 5జీ టెక్నాలజీ అభివృద్ధి ప్రాజెక్టుల్లో కూడా చైనాకు చెందిన హువావేను అనుమతించకపోవచ్చని వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఒకవేళ భారత్ లో వ్యాపారం చేసుకోకుండా హువావేను అడ్డుకుంటే తాము కూడా ప్రతీకార చర్యలు చేపట్టాల్సి వస్తుందని చైనా హెచ్చరించింది.

కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..‘భారత్ లో త్వరలో చేపట్టనున్న 5జీ మొబైల్ నెట్ వర్క్ పనులకు సంబంధించి హువావేకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పారు. హువావే ఉత్పత్తులతో చైనా ఆయా దేశాలపై నిఘా పెడుతోందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అమెరికా, భారత్ లు తనను ఒంటరిని చేయడానికి కుట్ర పన్నుతున్నాయని భావించిన డ్రాగన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్త్రీని పిలిపించుకున్న చైనా విదేశాంగ శాఖ, హువావేపై నిషేధం విధించే చర్యలను తాము ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ఒకవేళ హువావేపై నిషేధం విధిస్తే చైనా మార్కెట్ లోని భారతీయ కంపెనీలపై ప్రతీకార చర్యలు తీసుకోక తప్పదని సుతిమెత్తగా హెచ్చరించింది.  5జీ టెక్నాలజీ ఏర్పాటు విషయంలో అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా భారత్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.

More Telugu News