North Korea: ‘క్రిప్టో కరెన్సీ’పై ఉత్తర కొరియా గురి.. సైబర్ దాడులతో రూ.14,144 కోట్లు దోపిడీ!

  • అత్యాధునిక కంప్యూటర్లు వాడుతున్న కిమ్ ప్రభుత్వం
  • క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ లపై సైబర్ దాడులు
  • ఈ నిధుల్ని ఆయుధాల తయారీకి వాడుతున్న ఉ.కొరియా

ఐక్యరాజ్యసమితి ఆంక్షలను కాదని ఉత్తరకొరియా ఇప్పటికే పలు అణు, క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించినప్పటికీ తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. దీనివెనుక ఉన్న రహస్యం ఇప్పుడు బయటపడింది. ఉత్తరకొరియా తన ఆయుధాల అభివృద్ధికి సైబర్ దాడులను రాచమార్గంగా చేసుకుందని ఐక్యరాజ్యసమితి నివేదికలో తేలింది. ఈ నివేదికకు సంబంధించిన వివరాలు మీడియాలో లీక్ అయ్యాయి.

దీనిప్రకారం ఆదాయం కోసం ఉత్తరకొరియా ప్రధానంగా క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ లను లక్ష్యంగా చేసుకుంటోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ ఎక్స్ఛేంజ్ లు లక్ష్యంగా సైబర్ దాడులకు దిగడం ద్వారా ఉత్తరకొరియా ఇప్పటివరకూ రూ.14,144 కోట్లు(2 బిలియన్ డాలర్లు) సొమ్ము చేసుకుందని వెల్లడించింది. ఇలాంటి క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ లపై ఎక్కువగా ప్రభుత్వ నియంత్రణ ఉండదనీ, దీంతో ఇది ఉత్తరకొరియా పాలిట వరంగా మారిందని పేర్కొంది.

ఈ దాడుల కోసం ఉత్తరకొరియా అత్యాధునిక కంప్యూటర్లను వాడుతోందని విశ్లేషించింది. అంతేకాకుండా ఉత్తరకొరియా విదేశాల నుంచి అక్రమంగా ముడిచమురు, ఇతర ఖనిజాలు, ఆయుధాల తయారీ సామగ్రిని దిగుమతి చేసుకుంటోందని చెప్పింది. ఉత్తరకొరియాకు సరుకు రవాణాపై తమ ఆంక్షలు ఉండటంతో కిమ్ ప్రభుత్వం పలు నౌకల ద్వారా సరుకుల్ని మార్చుతూ తమ దేశానికి ముడిచమురు, ఆయుధాల తయారీ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తరలించుకుపోతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2006లో ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి పలు ఆంక్షలు విధించింది.

More Telugu News