Rahul Dravid: ఇండియన్ క్రికెట్ ను దేవుడే కాపాడాలి: గంగూలీ

  • ద్రవిడ్ కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల నోటీసు పంపిన బీసీసీఐ
  • ఇండియన్ క్రికెట్లోకి కొత్త ఫ్యాషన్ వచ్చిందన్న గంగూలీ
  • దిగ్గజాలకు నోటీసులు పంపడం వారిని అవమానించడమేనన్న హర్భజన్

బీసీసీఐ తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ మండిపడ్డాడు. రాహుల్ ద్రవిడ్ కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల నోటీసును పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇండియన్ క్రికెట్లో కొత్త ఫ్యాషన్ వచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం. వార్తల్లో నిలిచేందుకు ఇది బాగా తోడ్పడుతోంది. ఇండియన్ క్రికెట్ ను దేవుడే కాపాడాలి. ద్రవిడ్ కు బీసీసీఐ ఎథిక్స్ కమిటీ అధికారి నోటీసులు పంపారు' అంటూ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

గంగూలీ ట్వీట్ పట్ల టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. 'నిజమా? ఈ వ్యవహారం ఎటు వెళ్తోందో అర్థం కావడం లేదు. ఇండియన్ క్రికెట్ కు ద్రవిడ్ కంటే గొప్ప వ్యక్తి దొరకడు. ద్రవిడ్ లాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడం వారిని అవమానించడమే. ద్రవిడ్ లాంటి వారి సేవలు క్రికెట్ అభివృద్ధికి ఎంతో అవసరం. నిజమే... ఇండియన్ క్రికెట్ ను దేవుడే రక్షించాలి' అని వ్యాఖ్యానించాడు.

రాహుల్ ద్రవిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నాడు. ద్రవిడ్ పై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ కమిటీ అధికారి జస్టిస్ (రిటైర్డ్) డీకే జైన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్సీఏ డైరెక్టర్ గా ఉన్న ద్రవిడ్... ఇండియా సిమెంట్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారని... ఇది ముమ్మాటికీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, ఎథిక్స్ కమిటీ నుంచి ద్రవిడ్ కు నోటీసులు అందాయి. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.

సంజీవ్ శర్మ దిగ్గజ క్రికెటర్లపై ఫిర్యాదులు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లపై కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. దీనిపై టెండూల్కర్ ఎథక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించాడు. ముంబై ఇండియన్స్ కు తాను అందిస్తున్న సేవలకు గాను ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని సచిన్ తెలిపాడు. సౌరవ్ గంగూలీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు.

More Telugu News