Sushma Swaraj: నాడు సుష్మాస్వరాజ్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించిన ఉల్లిపాయలు!

  • 1998లో ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సుష్మ
  • పాలనలో తనదైన ముద్ర
  • ఎన్నికలకు ముందు పెరిగిన ధరలు
  • ప్రజాగ్రహంతో బీజేపీ ఓటమి

నిన్న రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూసిన సుష్మా స్వరాజ్, దేశ రాజధాని న్యూఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రన్న సంగతి తెలుసా? ఆమెను పెరిగిన ఉల్లిపాయల ధరలు గద్దె దించాయని తెలుసా? తన పాలనా కాలంలో న్యాయవ్యవస్థను పటిష్ఠం చేసి, నేరాల సంఖ్య తగ్గేలా చేసిన ఆమె, ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరగడంతో, తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొని గద్దె దిగాల్సి వచ్చింది. ఆ సమయంలోనే సుష్మా స్వరాజ్ కు దీటుగా కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ ను తెరపైకి తెచ్చింది.

ఇది 1993 నాటి మాట. ఢిల్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. తొలుత మదన్‌ లాల్ ఖరానా సీఎంగా బాధ్యతలు స్వీకరించగా, ఆపై మూడేళ్ల తరువాత ఆయన స్థానంలో సాహబ్‌ సింగ్ పాలనా పగ్గాలు చేపట్టారు. మరో ఏడాదిన్నర తరువాత, రాష్ట్రంలో ఏర్పడిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపధ్యంలో సుష్మా స్వరాజ్ ను ఢిల్లీకి సీఎంను చేయాలని వాజ్ పేయి నిర్ణయించారు.

అప్పటి నుంచి కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడం ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా ఉల్లి ధర సామాన్యునికి అందనంత ఎత్తునకు పెరిగింది. అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు వచ్చాయి. కూరగాయల ధరలను అదుపులో ఉంచడంలో సుష్మ విఫలం అయ్యారన్న ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో సుష్మ గద్దె దిగాల్సి వచ్చింది.

అయినప్పటికీ, ఢిల్లీ పోలీసుల వాహనంలో కూర్చుని వీధుల్లో ఆమె చేసిన పర్యటనలను, మహిళలకు రక్షణ కల్పించేందుకు ఆమె తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

More Telugu News