Imran Khan: ఇండియాతో యుద్ధం వచ్చే అవకాశం: ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

  • 370 రద్దుతో దుష్పరిణామాలు
  • పుల్వామా తరహా దాడులకు అవకాశం
  • ఇండియా జాగ్రత్తగా ఉండాలన్న ఇమ్రాన్

ఇండియాలో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఎంతటి దుష్పరిణామాలను ఆ దేశం ముందు ఉంచనుందో అతి త్వరలోనే తెలుస్తుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్, పుల్వామా తరహాలో మరిన్ని దాడులు జరగవచ్చని హెచ్చరించారు. భారత్ చర్యను తీవ్రంగా ఆక్షేపించిన ఆయన, ఈ నిర్ణయం తన ప్రభావాన్ని చూపకముందే పాలకులు మేల్కొనాలని అన్నారు. రెండు దేశాల మధ్యా యుద్ధం జరిగే పరిస్థితులకు దారితీయవచ్చని, ఆ పరిస్థితి రాకుండా ఇండియా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. కాశ్మీర్ లో యథాతథ స్థితిని కొనసాగించాలని సూచించారు.

కాగా, ఇదే సమయంలో లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడాన్ని తాము అంగీకరించబోమని చైనా వ్యాఖ్యానించగా, భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ విభజన పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము కల్పించుకోబోమని, ఇతర దేశాల నుంచి కూడా అదే కోరుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News