Tirumala: తిరుమలలో కలకలం... భక్తుడి సాక్సుల్లో మద్యం, మాంసం!

  • తిరుమలలో పనిచేస్తున్న మధురై యువకుడు
  • తెల్లవారుజామున కళ్లుగప్పి కొండపైకి మద్యం
  • అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అరెస్ట్

హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించే తిరుమలలో ఓ వ్యక్తి మద్యం, మాంసంతో వచ్చి పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. అలిపిరి చెక్ పోస్టును దాటి అతను ఎలా తిరుమలకు వచ్చాడన్న విషయమై అధికారులు విచారణకు ఆదేశించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరుమల ప్రధాన ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న రాంబగీచా అతిథి గృహాల వద్ద ఆ వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీలు చేశారు. అతని వద్ద మద్యం, మాంసం లభించడంతో అవాక్కయ్యారు.

ఆ వ్యక్తి, మధురైకు చెందిన కుమార్‌ అనే యువకుడని, తిరుమలలోని ఎంబీసీ కాటేజీల వద్ద ఉన్న ఓ టీ స్టాల్ లో పని చేస్తున్నాడని గుర్తించారు. తిరుపతి నుంచి అతను రహస్యంగా మద్యం, మాంసం తన వెంట తెచ్చుకున్నాడు. అలిపిరి వద్ద జరిగే తనిఖీల్లో పట్టుబడకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. సాక్సుల్లో ఐదు మద్యం బాటిళ్లు, మాంసాన్ని ప్యాక్ చేసుకున్నాడు.

అక్కడి సిబ్బంది కన్నుగప్పి, తెల్లవారుజాము ప్రాంతంలో తిరుమలకు వచ్చాడు. అతని ప్రవర్తన అనుమానంగా ఉండటంతో, మూడవ సెక్టార్‌ విజిలెన్స్‌ సిబ్బంది కుమార్‌ ను తనిఖీలు చేశారు. అతని వద్ద ఇవి లభించడంతో అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో అలిపిరి వద్ద జరుగుతున్న తనిఖీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News