Sushama swaraj: సుష్మా మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం.. మోదీ భావోద్వేగ ట్వీట్లు

  • సుష్మ మృతితో దిగ్భ్రాంతిలో బీజేపీ నేతలు
  • భారత రాజకీయాల్లో ఉజ్వల అధ్యాయం ముగిసింది
  • కోట్లాదిమందికి సుష్మ స్ఫూర్తి ప్రదాత

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణంతో బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పలువురు నేతలు భావోద్వేగానికి గురవుతున్నారు. భారత రాజకీయాల్లో ఉజ్వల అధ్యాయం ముగిసిందని ప్రధాని మోదీ ఉద్వేగ పూరిత ట్వీట్లు చేశారు. సుష్మ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.  

సుష్మ స్వరాజ్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని మోదీ ట్వీట్ చేశారు. సుష్మను అభిమానించే వారికి ఇది ఎంతో దురదృష్టకరమైన రోజని, దేశానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముుగిసిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని, ఆమె చేసిన ప్రతీ పనిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు. కోట్లాదిమందికి ఆమె స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.

తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన గొప్ప నేత సుష్మ స్వరాజ్ అన్న మోదీ.. ఆమె మంచి వక్త, ఉత్తమ పార్లమెంటేరియన్ అని ప్రశంసించారు. పార్టీ కోసం ఆమె ఎంతో చేశారని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలోనూ ఆమె తన విధులకు న్యాయం చేశారని, ఈ క్రమంలో ఆమె నిబద్ధత అనితర సాధ్యమని మోదీ పేర్కొన్నారు.  

More Telugu News