Dale Steyn: టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా అత్యధిక వికెట్ల వీరుడు స్టెయిన్

  • 15 ఏళ్ల టెస్టు క్రికెట్‌కు స్టెయిన్ విరామం
  • 93 టెస్టుల్లో 439 వికెట్లు
  • టెస్టు క్రికెట్ ఆడే 9 దేశాలపై ఐదేసి వికెట్లు పడగొట్టిన ఏకైక పేసర్

దక్షిణాఫ్రికా పేస్ లెజెండ్ డేల్ స్టెయిన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డులకెక్కిన 36 ఏళ్ల స్టెయిన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా స్టెయిన్ మాట్లాడుతూ.. తనకెంతో ఇష్టమైన ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా ఉందన్నాడు. తాను మరో టెస్టు ఆడలేననే విషయం తనను బాధిస్తోందన్నాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వన్డేలు, టీ20లలో ఎక్కువ కాలం ఆడేందుకు ప్రయత్నిస్తానని స్టెయిన్ పేర్కొన్నాడు.

2004లో ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్టెయిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో చివరి టెస్టు ఆడాడు. మొత్తం 93 టెస్టులు ఆడిన స్టెయిన్ 439 వికెట్లు తీసి 1251 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలున్నాయి.  కాగా, టెస్టు క్రికెట్ ఆడే దేశాలపై ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా స్టెయిన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

More Telugu News