Srisailam: ఇదే వరద నాలుగు రోజులు... కోరుకుంటున్న రాయలసీమ!

  • శరవేగంగా నిండుతున్న శ్రీశైలం
  • మూడు రోజుల నీరు వస్తే రాయలసీమకు నీరు
  • మరింత వరదవస్తే నాగార్జున సాగర్ కూ నీరు

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం శరవేగంగా నిండుతోంది. మరో నాలుగు రోజులు వరద కొనసాగితే, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ తో పాటు హంద్రీనీవాకు, తెలుగుగంగ కెనాళ్లకు నీరందించే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వస్తున్న నీటిపై రాయలసీమ రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 125 టీఎంసీల నీరు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 2,62,064 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇదే నీటి ప్రవాహం కొనసాగితే, రోజుకు 25 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది.

ప్రస్తుతం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 50 వేల క్యూసెక్కులకు పైగా నీటిని నాగార్జున సాగర్ డ్యామ్ కు విడుదల చేస్తుండటంతో, క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాలంటే మరింత సమయం పట్టవచ్చు. ఇదే సమయంలో మూడు రోజుల వరద నీరు వస్తే సుమారు 180 టీఎంసీలకు పైగా నీరు చేరుతుంది. అప్పుడు జలాశయంలో ఉన్న అన్ని కాలువలు, ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News