నైబర్ నంబర్.. ఇప్పుడిదో ట్రెండ్.. ట్రై చేశారా?

06-08-2019 Tue 08:00
  • తమ నంబరుకు ముందు/వెనకున్న నంబరు ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం
  • సోషల్ మీడియాలో ఇప్పుడిదో ట్రెండ్
  • స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెడుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఇప్పుడు సవాళ్లు ఎక్కువై పోయాయి. రోజుకో సవాలు నెటిజన్లను సవాలు చేస్తోంది. తమకందిన సవాలును ఉత్సాహంగా స్వీకరించి పూర్తి చేస్తుండడంతో ప్రస్తుతం ఇవి విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. గ్రీన్ చాలెంజ్ నుంచి బాటిల్ క్యాప్ చాలెంజ్ వరకు ఇటీవలి కాలంలో ఎన్నో పుట్టుకొచ్చాయి. తాజాగా ఇప్పుడో నయా ట్రెండ్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

‘నైబర్ నంబర్’ పేరుతో ట్రెండ్ అవుతున్న ఈ చాలెంజ్‌లో భాగంగా మన ఫోన్ నంబరుకు ముందు, లేదంటే వెనకున్న నంబరు ఎవరిదో తెలుసుకోవాలి. ఇందులో భాగంగా ఆయా నంబర్లకు మెసేజ్ చేస్తూ తమ పొరుగువారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెసేజ్ అందుకున్న అవతలి వ్యక్తులు కూడా ఉత్సాహంగా రిప్లై ఇస్తున్నారు. తమకొచ్చిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీసి, సోషల్ మీడియాలో పెడుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో ఇప్పుడిది ట్రెండ్‌గా మారింది.