Jammu And Kashmir: ‘ఆర్టికల్ 370 రద్దు’.. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • అమిత్ షా పేరు పార్లమెంటరీ చరిత్రలో నిలిచిపోతుంది
  • దీనంతటికీ కాంగ్రెస్ పార్టీయే కారణం
  • ఆర్టికల్ 370పై విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. దీన్ని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వాగతించారు. ఆర్టికల్ 370 రద్దుతో హోంమంత్రి అమిత్ షా పేరు భారత పార్లమెంటరీ వ్యవస్థ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ నేతలు మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని తాను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నట్లు చెప్పారు.

‘పాక్ భూభాగంలోకి 25 కిలోమీటర్ల  మేర దూసుకెళ్లిన భారత ఆర్మీని అప్పటి ప్రధాని జవహల్ లాల్ నెహ్రూ వెనక్కి పిలిచింది నిజం కాదా? అప్పుడు భారత సైన్యాన్ని వెనక్కి పిలవకుంటే ఈ రోజు ఈ విషయమై మనం చర్చించేవాళ్లమే కాదు. భారత ఉక్కు మనిషి సర్దార్ పటేల్ కు కశ్మీర్ విలీనం బాధ్యతలను ఇచ్చుంటే ఈ సమస్య అప్పుడే పరిష్కారమయ్యేది. భారత్ లో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండటం ఎలా సాధ్యం?

జాతీయ జెండాలను తగలబెడితే నేరం కాకపోవడం కేవలం జమ్మూకశ్మీర్ లోనే సాధ్యమవుతుంది. కేవలం కశ్మీరీ యువతిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఓ పాకిస్థానీ పౌరుడు భారతీయుడు ఎలా అవుతాడు? భారత్ లోని ఇతర రాష్ట్రాలకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే కశ్మీరీ అమ్మాయిలు ఆస్తి హక్కులు, తమ పిల్లల ఆస్తి హక్కులు కోల్పోవడం ఏంటి? అదే కశ్మీరీ అబ్బాయి ఇతర రాష్ట్రాల యువతులను పెళ్లి చేసుకుంటే ఆస్తి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకపోవడం ఏంటి? ఇది లింగ వివక్ష కాదా? ఇవన్నీ జమ్మూకశ్మీర్ లోనే జరుగుతున్నాయి’ అని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు.

More Telugu News