India: మర్యాదగా కిందకు దిగు.. లేదంటే బట్టలు చించేస్తా.. మహిళకు ఉబెర్ డ్రైవర్ టార్చర్!

  • బెంగళూరులో ఘటన
  • మహిళకు చుక్కలు చూపించిన డ్రైవర్
  • కనీస చర్యలు తీసుకోని క్యాబ్ యాజమాన్యం

భారత్ లో క్యాబ్ సర్వీసులు మహిళల పాలిట ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో తెలిపే ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ చోటికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కిన మహిళను తీవ్రంగా వేధించిన ఉబెర్ డ్రైవర్ ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా అర్ధరాత్రి సమయంలో తన క్యాబ్ నుంచి దిగిపోవాలనీ, లేదంటే దుస్తులను చించివేస్తానని హెచ్చరించాడు. చివరికి బాధితురాలికి ఉబెర్ కంపెనీ కూడా సాయం చేయలేదు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

నగరానికి చెందిన అపర్ణా బాలచందర్ ఓ ప్రాంతానికి వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేశారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘‘నా కొలీగ్స్ తో డిన్నర్ పూర్తయ్యాక నేను బయలుదేరేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేశా. అందులోని డ్రైవర్ ప్రస్తుతం కస్టమర్లు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పాడు. అంతలోనే ఒక్కసారిగా నావైపు తిరిగి..‘నువ్వు చదువుకున్న అమ్మాయివి కదా. సాయంత్రం 7 గంటల్లోపు ఇంటికి వెళ్లిపోవాలని తెలియదా? ఆడపిల్ల మందు తాగొచ్చా?’ అని వేధించాడు. దీంతో ‘నేను మందు తాగలేదు. నీ పని నువ్వు చూసుకో’ అని జవాబిచ్చా.

దీంతో సదరు డ్రైవర్ వ్యక్తిగత దూషణ చేయడం ప్రారంభించాడు. ‘నువ్వు వ్యభిచారిణివి, నా షూలు తుడిచేందుకు కూడా నువ్వు పనికిరావు’ అంటూ తిట్టాడు. దీంతో నేను తీవ్రంగా భయపడిపోయి ఉబెర్ పానిక్ బటన్ నొక్కాను. అయితే కంపెనీ నాకు బదులుగా డ్రైవర్ కే కాల్ చేసింది. దీంతో అతను ‘ఆమె మద్యం మత్తులో ఉంది’ అని జవాబిచ్చాడు. ఏం జరుగుతుందోనని భయపడ్డ నేను గట్టిగా కేకలు వేశాను. దీంతో కస్టమర్ కేర్ వాళ్లు ‘మీరు వెంటనే కారు దిగిపోండి. మీకు మరో కారు పంపుతాం’ అని చెప్పారు.

ఈ సందర్భంగా ఆ డ్రైవర్ ‘నువ్వు కారు దిగకుంటే నీ దుస్తులను నేనే చించేస్తా’ అని హెచ్చరించాడు. దీంతో రాత్రి 11.15 గంటల సమయంలో నడిరోడ్డుపై నిలబడ్డా. ఎంతసేపయినా ఉబెర్ కారు రాకపోవడంతో చివరికి నా స్నేహితులకు ఫోన్ చేశా. ఇంత జరిగితే ఉబెర్ ఏం చేసిందో తెలుసా? నా డబ్బులు రీఫండ్ చేసి చేతులు దులుపుకుంది.

ఉబెర్ భద్రత వ్యవస్థ, మహిళలకు రక్షణ ఎంత అధ్వానంగా ఉందో చెప్పేందుకే ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నా’’ అని పోస్ట్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై ఉబెర్ కంపెనీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా, ఉబెర్ కంపెనీ తీరే అంత అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

More Telugu News