‘ఆర్టికల్ 370’ని అసలు తొలగించడం సాధ్యమేనా? న్యాయ నిపుణులు ఏమంటున్నారు?

05-08-2019 Mon 11:49
  • భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు
  • పార్లమెంటు నిర్ణయం తీసుకోగలదన్న సుప్రీంకోర్టు
  • సాధ్యం కాదని గతంలో తీర్పు ఇచ్చిన హైకోర్టు

జమ్మూకశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దుచేస్తామని చెబుతున్న బీజేపీ ఎట్టకేలకు దాన్ని అమలు చేసింది. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగించడం సాధ్యమేనా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై 2015, డిసెంబర్ లో ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. ఆర్టికల్ 370ని రాజ్యాంగం నుంచి తొలగించే నిర్ణయం పార్లమెంటు మాత్రమే తీసుకోగలదని తెలిపింది.

ఇక జమ్మూకశ్మీర్ హైకోర్టు 2015లో ఓ కేసు విచారణ సందర్భంగా..’ఆర్టికల్ 370 అనేది భారత రాజ్యాంగంలో తాత్కాలిక నిబంధన అనే శీర్షికన ఉన్నప్పటికీ ఇది శాశ్వతమైన నిబంధన. దీన్ని ఉపసంహరించడం కానీ, సవరించడం కాని కుదరదు’ అని తేల్చిచెప్పింది. అయితే రాజ్యాంగ నిపుణులు మాత్రం జమ్మూకశ్మీర్ హైకోర్టు తీర్పునకు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఈ విషయమై ఓ న్యాయ నిపుణుడు మాట్లాడుతూ..‘భారత రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, శాశ్వత అనే మూడు రకాల నిబంధనలు ఉన్నాయి. వీటిలో తాత్కాలిక నిబంధనలు అన్నవి చాలా బలహీనమైనవి. వీటిని పార్లమెంటు సవరించవచ్చు. ఇప్పుడున్న ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధనే. అయితే ఆర్టికల్ 370 రద్దు కోసం ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

పార్లమెంటు ఆమోదం అనంతరం దీన్ని సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొత్త సరిహద్దుల్ని ఏర్పాటు చేయవచ్చనీ, అయితే కశ్మీర్ విషయంలో దీనికి ఆర్టికల్ 370 అడ్డుపడుతోందని చెప్పారు. కాగా, ఇది అంత సులభమైన పనికాదనీ, రాష్ట్రాల విభజన, సరిహద్దుల నిర్ణయం, శాంతిభద్రతల సమస్యలు ప్రభుత్వానికి సవాలుగా మారవచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు.