Jammu And Kashmir: కశ్మీర్ లో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.. ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టారు!: గులాంనబీ ఆజాద్

  • రాత్రికిరాత్రి పెద్దనోట్లను రద్దుచేశారు
  • బీజేపీ 1947 నాటి తప్పులు చేస్తోంది
  • ముగ్గురు మాజీ సీఎంలను హౌస్ అరెస్ట్ చేస్తారా?

జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీజేపీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. పెద్దనోట్ల రద్దు సమయంలోనూ రాత్రికిరాత్రి నిర్ణయం తీసుకుని భారత ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ ను భారత్ లో అంతర్భాగంగా ఉంచేందుకు వందలాది మంది జవాన్లు, వేలాది మంది కశ్మీరీలు అనేక త్యాగాలు చేశారు. ఇప్పుడు అధికారదాహంతో బీజేపీ 1947 నాటి తప్పులనే చేస్తోంది.

నిన్నమొన్నటివరకూ కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. ఎన్నికలు సజావుగా సాగాయి. పాఠశాలలు, కాలేజీలు జరుగుతున్నాయి. పర్యాటకులు కూడా హాయిగా వచ్చిపోతున్నారు. కానీ ఉన్నపళంగా రాష్ట్రంలో పరిస్థితులను అల్లకల్లోలంగా మార్చారు. ఏకంగా ముగ్గురు మాజీ సీఎంలను గృహనిర్బంధం చేయాల్సిన అవసరం ఏంటి?

కశ్మీర్ లో ప్రధాన రాజకీయ పార్టీలను అంతంచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. టూరిజంకు కీలకమైన ఆగస్టు నెలలో పర్యాటకుల్ని వెనక్కు పిలిపించి జమ్మూకశ్మీర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారు’ అంటూ ఆజాద్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం చేపట్టే ఎలాంటి దుందుడుకు చర్యనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News