West Godavari District: ఓటమిపాలై నందుకు గర్వ పడుతున్నా: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • పదవులు ఆశించి నేను రాజకీయాల్లోకి రాలేదు
  • నిస్వార్థంగా పని చేసే వ్యక్తులు ఇంకా ఉన్నారని చెప్పేందుకే పోటీ చేశా
  • రౌడీ యిజాన్ని, దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయసమావేశంలో ‘జనసేన’ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఓటమిపాలైనందుకు గర్వ పడుతున్నానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

2014లో మద్దతు ఇచ్చినందుకే తనకు పదవులు ఇస్తానని అన్నారని, ఎటువంటి పదవులు ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదని, నిస్వార్థంగా పని చేసే వ్యక్తులు ఇంకా ఉన్నారని చెప్పేందుకే ఎన్నికల్లో తాను పోటీ చేశానని అన్నారు. ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం శ్రమిస్తామని చెప్పారు.

జనసేన పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు. ప్రజలు తమ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామని అన్నారు. తన ప్రాణం పోయిన సరే, పార్టీని విలీనం చేయడం జరగదని స్పష్టం చేశారు. రౌడీ యిజాన్ని, దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగితే సహించమని హెచ్చరించారు. ఏపీలో పింఛన్లు, ఇసుక కొరత తదితర విషయాల గురించి ప్రస్తావించారు. 

More Telugu News