జనసేన ఎమ్మెల్యే రాపాకపై ప్రశంసలు కురిపించిన పవన్ కల్యాణ్!

04-08-2019 Sun 15:09
  • పశ్చిమగోదావరిలో పవన్ కల్యాణ్ రెండ్రోజుల పర్యటన
  • రాజమండ్రిలో ఘనస్వాగతం పలికిన శ్రేణులు
  • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న జనసేనాని
పశ్చిమగోదావరి జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు రాజమండ్రికి చేరుకున్నారు. ఆయనకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందనీ, జనసేన కార్యకర్తలు కూడా ఇందులో పాలుపంచుకోవాలని కోరారు.

ఈ పర్యటనలో భాగంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం, భవిష్యత్ కార్యాచరణ, 2 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనే విషయాన్ని సమీక్షిస్తామని చెప్పారు. రాజకీయాలు హుందాగా ఉండాలని జనసేన పార్టీ కోరుకుంటోందని పవన్ చెప్పారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో అలాగే వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. అసెంబ్లీని హుందాగా నడపాల్సిన బాధ్యత వైసీపీ, టీడీపీలపై కూడా ఉందని వ్యాఖ్యానించారు.