ప్లాస్టిక్ కవర్ లో బహుమతి ఇచ్చిన బెంగళూరు మేయర్.. రూ.500 జరిమానా విధించిన అధికారులు!

04-08-2019 Sun 12:34
  • 2016 నుంచే బీబీఎంపీలో నిషేధం
  • ముఖ్యమంత్రికి ప్లాస్టిక్ కవర్ లో బహుమతి ఇచ్చిన గంగాంబికే
  • జరిమానాను చెల్లించిన బెంగళూరు మేయర్
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో పాటు బెంగళూరు మేయర్ గంగాంబికే మల్లికార్జున్ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపి ప్లాస్టిక్ కవర్ తో కప్పిన బహుమతిని అందజేశారు. దీనిపై బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్లాస్టిక్ వాడకంపై 2016 నుంచే నిషేధం ఉన్నప్పటికీ మేయర్ దాన్ని ఉల్లంఘించడంతో రూ.500 జరిమానా విధించింది. దీంతో తన తప్పును గుర్తించిన మేయర్ వివాదాల జోలికి పోకుండా రూ.500 జరిమానాను చెల్లించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.