India: విండీస్‌తో టీ20 సిరీస్.. విజయంతో బోణీ చేసిన భారత్

  • భారత బౌలర్ల దెబ్బకు విండీస్ విలవిల
  • నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
  • మూడు వికెట్లు పడగొట్టిన సైనీకి మ్యాన్ ఆఫ్  ద మ్యాచ్

విండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ సనాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. తొలి బంతికే ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ తర్వాత కూడా విండీస్ వికెట్ల పతనం కొనసాగింది. భారత బౌలర్లు ఓవర్‌కో వికెట్ చొప్పున తీస్తూ విండీస్ వెన్నులో వణుకు పుట్టించారు. నవదీప్ సైనీ అయితే మూడు వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచాడు. భారత బౌలర్ల విజృంభణకు కుదేలైన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. నికోలస్ పూరన్ (20), కీరన్ పొలార్డ్ (49) రాణించడంతో కరీబియన్లు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగారు. విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఐదుగురు ఖాతా తెరవకపోవగా, నలుగురి స్కోరు సింగిల్ డిజిట్ దాటలేదు.

అనంతరం 96 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 17.2 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శిఖర్ ధవన్ ఒక్క పరుగుకే అవుటై నిరాశ పరిచినప్పటికీ రోహిత్ శర్మ (24), కెప్టెన్ కోహ్లీ (19), మనీష్ పాండే (19), కృనాల్ పాండ్యా (12), రవీంద్ర జడేజా (10), వాషింగ్టన్ సుందర్ 9(8) పరుగులు చేశారు. ధోనీ స్థానంలో జట్టులో చోటు సంపాదించుకున్న రిషభ్ పంత్ గోల్డెన్ డక్ అయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు వికెట్లు తీసి భారత విజయం కీలక పాత్ర పోషించిన నవ్‌దీప్ సైనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నేడు ఇక్కడే రెండో మ్యాచ్ జరగనుంది.

More Telugu News