నయీం కేసు ఛార్జ్ షీట్ లో తన పేరును చేర్చడంపై ఆర్.కృష్ణయ్య స్పందన

03-08-2019 Sat 16:48
  • నయీం కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే నా పేరును ఛార్జ్ షీట్ లో చేర్చారు
  • నయీం కేసులో దొరికిన డబ్బును బాధితులకు ఇవ్వాలి
నయీం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీసీ సంఘాల నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. తాను కేవలం నయీం బాధితుల పక్షాన మాత్రమే మాట్లాడానని చెప్పారు. నయీంకు సంబంధించిన విషయాలను తాను అప్పట్లోనే చెప్పానని తెలిపారు. తన వద్దకు ప్రతి రోజు ఎంతో మంది వస్తుంటారని.. వాళ్ల తరపున ఫోన్ చేసి నయీంను బెదిరించానని చెప్పారు. తాను ఎలాంటి దందాలు చేయలేదని అన్నారు. తన పేరును ఛార్జ్ షీట్ లో పెట్టడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే తనను ఛార్జ్ షీట్ లో చేర్చారని ఆరోపించారు. బీసీల పక్షాన పోరాడకుండా తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నయీం కేసులో దొరికిన డబ్బును బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నయీం డైరీని బయట పెట్టాలని, సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.