Chris Gayle: పాకిస్థాన్ ఆశాకిరణానికి చుక్కలు చూపించిన గేల్

  • గ్లోబల్ టి20 లీగ్ లో కొనసాగుతున్న గేల్ విధ్వంసం
  • వాంకోవర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్
  • ఎడ్మంటన్ రాయల్స్ పై 44 బంతుల్లో 94 పరుగులు

కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టి20 లీగ్ లో విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మెరుపులు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న హేమాహేమీలున్న ఓ జట్టును పసికూనలా మార్చేసి పరుగుల సునామీ సృష్టించిన గేల్ మరోసారి తన దూకుడు రుచిచూపించాడు. గేల్ పవర్ కు ఈసారి పాకిస్థాన్ వండర్ కిడ్ షాదాబ్ ఖాన్ ఒకే ఓవర్లో 32 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.

ఈ లీగ్ లో వాంకోవర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ ఎడ్మంటన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 6 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. పాకిస్థాన్ ఆశాకిరణంగా భావిస్తున్న 20 ఏళ్ల యువ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ వేసిన ఓ ఓవర్లో తొలి రెండు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచిన గేల్ ఆపై రెండు బంతులకు ఫోర్లు కొట్టాడు. మళ్లీ చివరి రెండు బంతులను స్టేడియం బయటకు కొట్టి ఆ ఓవర్లో మొత్తం 32 పరుగులు పిండుకున్నాడు.

గేల్ విజృంభణతో 166 పరుగుల విజయలక్ష్యాన్ని వాంకోవర్ జట్టు 16.3 ఓవర్లలోనే అందుకుంది. 48 బంతుల్లో 59 పరుగులు కావాల్సిన స్థితిలో గేల్ ఒక్క ఓవర్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు.

More Telugu News