Jammu And Kashmir: మౌనంగా ఉండండి.. పుకార్లను నమ్మొద్దు: జమ్ముకశ్మీర్ గవర్నర్

  • అమర్ నాథ్ యాత్రికులను వెనక్కి పిలిపిస్తున్న కేంద్రం
  • కశ్మీర్ కు భారీగా చేరుకుంటున్న సాయుధబలగాలు
  • కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తత

అందరూ మౌనంగా, ప్రశాంతంగా ఉండాలని, పుకార్లను నమ్మొద్దని జమ్ముకశ్మీర్ రాజకీయ నేతలకు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచించారు. ఉగ్రదాడులు జరగనున్నాయనే అంచనాలతో అమర్ నాథ్ యాత్రికులను వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కశ్మీర్ లోయలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో, వివిధ పార్టీలకు చెందిన నేతలను గవర్నర్ తన వద్దకు పిలిపించుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వారికి చెప్పారు. గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, షా ఫైసల్, సజ్జాద్ లోనీ, ఇమ్రాన్ అన్సారీ తదితరులు ఉన్నారు.

ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉందని ఈ సందర్భంగా సత్యపాల్ మాలిక్ తెలిపారు. అయితే, ఉగ్రవాదుల అంశాన్ని ఇతర అంశాలతో ముడిపెడుతూ పుకార్లను ప్రచారం చేస్తూ, భయాందోళనలకు గురి చేస్తున్నారని చెప్పారు. మరోవైపు, జమ్ముకశ్మీర్ ప్రజలకు అక్కడి ఉద్యోగాలు, భూమిపై ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న 'ఆర్టికల్ 35 A'ను కేంద్రం రద్దు చేయబోతోందని... అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా వేలాది సాయుధ బలగాలను లోయలోకి పంపుతోందనే ఆందోళన అక్కడి నేతలు, ప్రజల్లో నెలకొంది.

నిన్న మీడియాతో మెహమూబా ముఫ్తీ మాట్లాడుతూ, రాజ్యాంగం తమకు కల్పించిన ప్రత్యేక హక్కులను హరించేందుకు కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారు. తమకు మిగిలిన కొద్దిపాటి గుర్తింపును కూడా దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News