ఢిల్లీ వాసి పునీత్‌కు క్షమాపణలు చెప్పిన సన్నీలియోన్

03-08-2019 Sat 09:13
  • ‘అర్జున్ పాటియాలా’ సినిమాలో ఫోన్ నంబరు చెప్పిన సన్నీలియోన్
  • అది నిజంగా ఆమెదే అనుకుని ఫోన్లు
  • పోలీసులను ఆశ్రయించిన పునీత్

తన కారణంగా రోజుకు 150 ఫోన్ కాల్స్ అందుకుంటున్న ఢిల్లీ వాసి పునీత్ అగర్వాల్‌కు బాలీవుడ్ నటి సన్నీలియోన్ క్షమాపణలు తెలిపింది. ఆమె నటించిన ‘అర్జున్ పాటియాలా’ సినిమాలో సన్నీలియోన్ ఓ సందర్భంలో తన  ఫోన్ నంబరును చెబుతుంది. ఈ సినిమా చూసిన వారు అది నిజంగా సన్నీ నంబరే అనుకుని ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఆ నంబరు ఢిల్లీకి చెందిన పునీత్ అగర్వాల్‌ది. ఆ విషయం తెలియకుండానే సినిమాలో అతడి నంబరును వాడేశారు.

గత నెల 26న సినిమా విడుదలైనప్పటి నుంచి రోజుకు 150 వరకు ఫోన్ కాల్స్ వస్తుండడంతో పునీత్ విసుగెత్తిపోయాడు. సన్నీలియోన్‌తో మాట్లాడాల్సి ఉందని, ఆమెకు ఫోన్ ఇవ్వాల్సిందిగా కోరడంతో ఇక తన వల్ల కాక పోలీసులను ఆశ్రయించాడు. ఎవరెవరో తనకు ఫోన్ చేసి సన్నీలియోన్ కావాలంటూ వేధిస్తున్నారని పునీత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వార్త వైరల్ కావడంతో ఎట్టకేలకు సన్నీ స్పందించింది. ఇలా అవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పునీత్‌కు క్షమాపణలు చెప్పింది.