Vijayasanthi: ఇది కేసీఆర్ సర్కారు మరో డ్రామా: విజయశాంతి

  • సంచలనం సృష్టించిన నయీమ్ కేసు వివరాలు
  • టీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాలేదు
  • సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్న కేసీఆర్
  • ఫేస్ బుక్ లో విజయశాంతి

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులోని వివరాలను నిన్న ఆర్టీఐ చట్టం కింద ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటకు తీసుకురాగా, ఆ గ్యాంగ్ లో భాగమైన అసలు టీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాకుండా కేసీఆర్ సర్కారు జాగ్రత్త పడిందని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మరో నాటకాన్ని మొదలు పెట్టిందని విమర్శలు గుప్పించారు.

"గ్యాంగ్ స్టర్ నయీమ్ డైరీలో ప్రస్తావించిన పేర్లు అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి కుదిపేస్తోంది. ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి నాటకాలు ఆడటం ఇది కొత్త కాదు. నయీమ్ డైరీ లో పేర్కొన్న పేర్లకు సంబంధించి వివరాలు పత్రికల్లో వచ్చాయి. కానీ ఈ వివరాలలో కూడా చాలావరకు ఎడిటింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా నయీమ్ తో సంబంధాలు ఉన్న అధికారులు ఇతర పార్టీ నేతల వివరాలు వెల్లడించిన టిఆర్ఎస్ ప్రభుత్వం... తమ పార్టీకి సంబంధించిన కీలక నేతల వివరాలను ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు ఉద్దేశపూర్వకంగా కొందరి పేర్లను మాత్రమే బయటకు లీక్ చేశారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

నయీమ్ తో మొదటి నుంచి లింకులు ఉన్న కొందరు నేతలకు టీఆర్ఎస్ పెద్దలు అభయ హస్తం ఇచ్చి... నయీమ్ ద్వారా దోచుకున్న సొమ్ము లో వాటా కూడా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నయీమ్ తో సన్నిహితంగా మెలిగిన కొందరు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ హైకమాండ్ అండతో కీలక పదవులను అనుభవిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళ పేరు ఎందుకు ప్రస్తావనకు రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగే అరాచకాలపై కేంద్రం దృష్టి సారించిందని పదేపదే చెబుతున్న బీజేపీ నేతలు.. నయీమ్ వ్యవహారంపై అసలు నిజాలు వెలుగులోకి వచ్చేందుకు కేంద్ర హోంశాఖ ద్వారా విచారణ జరిపిస్తే... టీఆర్ఎస్ బండారం బయట పడే అవకాశం ఉంటుంది. నయీమ్ పేరుతో జరిగే నాటకానికి తెర పడుతుంది" అని ఆమె అన్నారు.

More Telugu News