Industries: వార్షిక నివేదికలు సమర్పించని కంపెనీలపై కేంద్రం కొరడా.. తెలుగు రాష్ట్రాల్లో 4,715 కంపెనీలు రద్దు?

  • తెలంగాణలో అత్యధికంగా 3,410
  • ఆస్తులు, అప్పుల పట్టిక ఆధారంగా కంపెనీల పనితీరుపై సమీక్ష
  • రిజిస్ట్రేషన్‌ రద్దుకు ఎంసీఏ నోటీసులు

కేంద్ర ప్రభుత్వం ‘స్ట్రయిక్‌ ఆఫ్‌ డ్రైవ్‌’ పేరుతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో నిబంధనల ప్రకారం పత్రాలను సమర్పించని కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు 2 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేయగా మూడో విడత గుర్తింపు రద్దు కార్యక్రమానికి పూనుకుంది.

2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు ఆస్తులు, అప్పుల పట్టిక, వార్షిక నివేదికలను సమర్పించని కంపెనీలకు జూలై 31 వరకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కంపెనీలు 30 రోజుల్లో తగిన వివరణ ఇచ్చి అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఆగస్టు 31 చివరి నాటికి పత్రాలు సమర్పించని కంపెనీలకు 'ఎస్‌టీకే 5' నోటీసులు ఇస్తారు.

అప్పటికీ స్పందించకుంటే అక్టోబరు రెండో వారంలో ఆయా కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. ఇలా, దేశవ్యాప్తంగా ఆస్తులు, అప్పుల పట్టిక, వార్షిక రిటర్న్‌లు దాఖలు చేయని కంపెనీలు 80 వేల నుంచి లక్ష వరకూ ఉన్నట్టు అంచనా.  ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలు 1,305, తెలంగాణ కంపెనీలు 3,410 ఉన్నట్లు సమాచారం. 

More Telugu News