Madhya Pradesh: ఫుడ్ డెలివరీ బాయ్ ముస్లిం అని వెనక్కి పంపిన వ్యక్తి.. జైలుకు పంపుతామన్న పోలీసులు

  • డెలివరీ బాయ్ హిందువు కాదని తిప్పి పంపానంటూ ట్వీట్
  • ఆహారానికి మతం ఉండదన్న జొమాటో
  • మరోసారి అలాంటి ట్వీట్లు చేస్తే తీవ్ర పరిణామాలంటూ పోలీసుల హెచ్చరిక

ఫుడ్ డెలివరీ బాయ్ ముస్లిం కావడంతో తీసుకొచ్చిన ఆహారాన్ని తిప్పి పంపిన వ్యక్తిపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చిపనులు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరిస్తూ నోటీసులు పంపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శుక్లా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఆహారం ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీకి వచ్చిన వ్యక్తి హిందువు కాదన్న కారణంతో ఆహారం తీసుకోకుండా అతడిని వెనక్కి పంపాడు. అక్కడితో ఆగక తాను చేసిన ఘనకార్యాన్ని ట్వీట్ చేయడంతో అది వైరల్ అయింది.

దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారితీసిన అమిత్ ట్వీట్‌పై జొమాటో తీవ్రంగా స్పందించింది. ఆహారానికి మతం ఉండదని బదులిచ్చింది. మరోవైపు, పోలీసులు కూడా స్పందించారు. మరోసారి ఇలాంటి ట్వీట్లు చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని నోటీసులు పంపారు. మతపరమైన విద్వేషాలు రేకెత్తించేలా ఇలాంటి వ్యాఖ్యలు తగవని హితవు పలికారు.

More Telugu News