Sravanamasam: రేపటి నుంచి శుభ శ్రావణం... ముఖ్యమైన పర్వదినాల వివరాలు!

  • మాసం తొలిరోజే శుక్రవారం
  • 9న వరలక్ష్మీ వ్రతం
  • శుక్రమూఢమి కారణంగా లేని శుభకార్యాలు

నేటితో ఆషాఢ మాసం వెళ్లిపోతోంది. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం రేపు ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంలో మాసం తొలిరోజునే శుక్రవారం కావడం గమనార్హం. వాస్తవానికి నేటి మధ్యాహ్నం నుంచే శ్రావణమాసం మొదలైనట్టు. కానీ, రేపు ఉదయం సూర్యోదయం తరువాత శ్రావణ పాడ్యమి మిగులు ఉండటంతో రేపటి నుంచే నెల మొదలైనట్టు.

ఇక రేపటి నుంచి 29వ తేదీ వరకూ కొనసాగే శ్రావణంలో ఎన్నో పర్వదినాలు పలకరించనున్నాయి. 4న నాగుల చవితి, 6న మంగళగౌరీ వ్రతం, 9న రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం, 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పౌర్ణమి రానున్నాయి. పౌర్ణమి నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి. 19వ తేదీన సంకష్టహర చతుర్థి, 23న కృష్ణాష్టమి పర్వదినాలు రానున్నాయి. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందనడంలో సందేహం లేదు.

ఇదే సమయంలో ఎంతో శుభమని భావించే శ్రావణంలో శుభ ముహూర్తాలు లేకపోవడం గమనార్హం. జూలై 9వ తేదీన ప్రారంభమైన శుక్ర మూఢమి సెప్టెంబర్ 19 వరకూ కొనసాగనుండటం, ఆపై పది రోజుల పాటు పితృపక్షాలు ఉండటంతో, సెప్టెంబర్ 29న ఆశ్వయుజ మాసం మొదలయ్యే వరకూ శుభ ముహూర్తాలు లేవు. అంటే వివాహం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు ఉండవు.

More Telugu News