Vakati Narayana Reddy: టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు!

  • నెల్లూరులోని ఇంట్లో నాలుగు గంటలపాటు సోదాలు
  • పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న వాకాటి

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఆయన నివాసంలో దాదాపు నాలుగు గంటలకుపైగా సోదాలు జరిగాయి. బ్యాంకులను మోసం చేసిన కేసులో గత సంవత్సరం జనవరి 21న వాకాటి అరెస్టయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బెంగళూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కాగా, నిన్న వాకాటి ఇంటికి వచ్చిన అధికారులు, తిరుపతిలో ఉన్న ఆయన పర్సనల్ అసిస్టెంట్ రామకృష్ణను పిలిపించి, తనిఖీలు ప్రారంభించారు. తనిఖీల తరువాత వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. వీఎన్‌ఆర్‌ ఇన్‌ ఫ్రా, వీఎన్‌ఆర్‌ రైల్, లాజిస్టిక్స్‌ తదితర కంపెనీలు నిర్వహించిన వాకాటి, వాటి పేరిట బ్యాంకుల్లో రుణాలను తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే. నకిలీ డాక్యుమెంట్లు చూపించి, బ్యాంకుల నుంచి భారీ మొత్తం రుణాన్ని తీసుకున్నారని తేలడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.

More Telugu News