cinema: నేను ఇప్పట్లో గ్యారంటీగా చచ్చిపోను.. చాలా స్ట్రాంగ్ గా ఉన్నా: వదంతులపై ప్రముఖ నటుడు పోసాని వివరణ

  • నాపై వస్తున్న వదంతులను నమ్మొద్దు
  • నా ఆరోగ్యం బాగుంది
  • డాక్టర్ ఎంవీ రావు వల్లే నేను బతికాను

తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలో తనకు ఆపరేషన్ చేసిన భాగాల్లో ఇన్ ఫెక్షన్ వచ్చిందని, అది వైద్యులు కనిపెట్టి, లండన్ నుంచి వచ్చిన వైద్యుడు తనకు మరో ఆపరేషన్ చేయడంతో బతికి ఉన్నానని, లేకపోతే ‘మన శాల్తీ పైకి వెళ్లి పోయేది’ అని అన్నారు. గంటన్నర సమయంలో ఈ ఆపరేషన్ చేశారని, ఆ మర్నాటికే తనకు ఎంతో ఎనర్జీ వచ్చిందని చెప్పారు.

ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల వేదికగా తనపై వదంతులు వ్యాపించాయని ‘విఫలమైపోయిన ఆపరేషన్.. విషమ పరిస్థితిలో పోసాని కృష్ణమురళి’ అంటూ కథనాలు వెలువడ్డాయని, ఇలాంటి వాటితో తన భార్య చాలా బాధపడిందని చెప్పారు. అసత్య కథనాల వల్ల తనకు సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చే వాళ్లు కూడా ఇవ్వరని, ‘పోసాని బతకడం చాలా కష్టమటగా’ అని ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం తనకు తెలుసని చెప్పారు. ఆ తర్వాత ‘నేను బాగున్నాను’ అని మీడియా ద్వారా ఓసారి చెప్పానని, ఆ విషయం ఎవరికి చేరలేదని అన్నారు.

అందుకని, మరోసారి మీడియా ద్వారా చెబుతున్నా, ‘నేను వెరీ హెల్దీగా ఉన్నా. ఆరోగ్యం చాలా బాగుంది. రెండు ఆపరేషన్లు చేశారు. ఒకటి మీరు (సోషల్ మీడియా) చెప్పినట్టుగా ఫెయిల్ అవలేదు. ఇన్ఫెక్షన్ వచ్చింది. రెండో ఆపరేషన్ ను చేశారు. డాక్టర్ ఎంవీ రావు గారు వల్లే నేను బతికా’ అని అన్నారు. గతంలో తన భార్యకు ‘నిమోనియా’ వస్తే డాక్టర్ ఎంవీ రావే బతికించారని గుర్తుచేశారు. తనకు, తన భార్యకు పునర్జన్మ ఇచ్చింది ఈ డాక్టరేనని చెప్పారు. ‘నేను ఇప్పట్లో గ్యారంటీగా చచ్చిపోను. చాలా స్ట్రాంగ్ గా ఉన్నా. కాబట్టి, నాకు వేషాలు ఇవ్వొచ్చు’ అని పోసాని తన దైన శైలిలో మాట్లాడారు.

More Telugu News