Ayurved bhavan: చార్మినార్ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహిస్తున్న వైద్య విద్యార్థినిపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన

  • కాళ్లతో తొక్కి, గోళ్లతో గట్టిగా గిచ్చిన కానిస్టేబుల్
  • బాధతో అరుస్తూ విలవిల్లాడిన వైద్య విద్యార్థిని
  • కానిస్టేబుల్ ప్రవర్తనపై సర్వత్రా నిరసన

హైదరాబాదు, చార్మినార్ లోని ఆయుర్వేద భవన్‌ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న అక్కడి వైద్య విద్యార్థులు నేడు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. అయితే విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో ఓ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు జుగుప్సను కలిగించింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి బలవంతంగా వాహనం ఎక్కించే క్రమంలో ఓ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

కాళ్లతో తొక్కి, గోళ్లతో గట్టిగా గిచ్చడంతో సదరు విద్యార్థిని బాధతో గట్టిగా అరుస్తూ విలవిల్లాడిపోయింది. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కడంతో సదరు కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో కానిస్టేబుల్ ప్రవర్తనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆరా తీస్తున్నారు.

More Telugu News