Indore: అమ్మతోడు! నా పేరు రాహుల్ గాంధీనే.. నన్ను నమ్మండి ప్లీజ్: ఇండోర్ యువకుడు

  • రాహుల్ గాంధీ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇండోర్ వ్యక్తి
  • పేరు చెప్పగానే అందరూ తనను అదోలా చూస్తున్నారని ఆవేదన
  • పేరు మార్చుకునే యోచనలో 22 ఏళ్ల యువకుడు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు తెగ బాధపడిపోతున్నాడు. ఆ యువకుడి బాధకు కారణం తెలిస్తే నోరెళ్లబెట్టడం మన వంతవుతుంది. తన పేరు చెప్పాల్సి వచ్చిన ప్రతి చోట అతడు అవమానాలు ఎదుర్కొంటున్నాడు. కారణం అతడి పేరు ‘రాహుల్ గాంధీ’ కావడమే. టెక్స్‌టైల్ వ్యాపారి అయిన రాహుల్ గాంధీ ఇప్పుడు తన ఇంటి పేరు కారణంగా తీవ్ర కష్టాలు పడుతున్నాడు.

తన పేరు చెప్పగానే అందరూ తనను అదోలా చూస్తున్నారని, తనను నకిలీ వ్యక్తిలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సిమ్ కార్డు కొనడానికో, ఇంకో దానికో తన ఆధార్ నంబరు ఇచ్చినప్పుడు అది చూసిన వారి కళ్లు తనను అదోలా చూస్తున్నాయని అన్నాడు. తనను అనుమానిస్తున్నారని వాపోయాడు. ఫోన్‌లో కొత్త వ్యక్తులకు తన పేరు చెప్పి పరిచయం చేసుకునే క్రమంలో వారి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు తనను ఇబ్బందికి గురిచేస్తున్నాయన్నాడు. ఫోన్‌లో తన పేరు చెబితే ‘రాహుల్ గాంధీ ఇండోర్‌లో నివసిస్తున్నాడా?’ అని వేళాకోళం చేస్తున్నారని అన్నాడు. తనను ఫేక్ కాలర్‌గా భావిస్తున్నారని అన్నాడు.

తనకు గాంధీ అనే పేరు ఎలా వచ్చిందో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చాడు. తన తండ్రి రాజేశ్ మాలవీయ ఆర్మీలో వాషర్‌మన్‌గా పనిచేసేవాడని, దీంతో బీఎస్‌ఎఫ్ అధికారులు సరదాగా ‘గాంధీ’ అని పిలిచేవారని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి కూడా ఆ పేరును కొనసాగించాడని పేర్కొన్నాడు. అలా అది ఇంటి పేరుగా స్థిరపడిపోయిందన్నాడు.

తాను చదువుకున్న స్కూలు రిజిస్టర్‌లో కూడా రాహుల్ గాంధీ అనే తన పేరు ఉంటుందని, తన ఆధార్ కార్డుపైనా అదే ఉందని వివరించాడు. ఐదో తరగతి మాత్రమే చదువుకున్న రాహుల్ గాంధీ తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదన్నాడు. అయినప్పటికీ పేరు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పాడు. ఈ ఇబ్బందుల కంటే పేరు మార్చుకోవడం మంచిదని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు.

More Telugu News