jayalalitha: రాజకీయాలకు జయలలిత మేనకోడలు దీప గుడ్ బై

  • ‘ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై’ పార్టీని స్థాపించిన దీప
  • అన్నాడీఎంకేలో విలీనం చేశానని ప్రకటన
  • రాజకీయాలు చర్చించేందుకు ఎవరూ రావద్దని విన్నపం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం తెరపైకి వచ్చి రాజకీయ పార్టీని స్థాపించిన ఆమె మేనకోడలు దీప రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు. తన పార్టీ  ‘ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై’ని అన్నాడీఎంకేలో విలీనం చేశానని, కాబట్టి రాజకీయాలపై చర్చించేందుకు ఇకపై తన వద్దకు ఎవరూ రావద్దని కోరారు.

జయలలిత మృతి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన దీప 24 ఫిబ్రవరి 2017న ‘ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై’ పేరుతో పార్టీని ప్రారంభించారు. మంగళవారం ఫేస్‌బుక్ ద్వారా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొన్న దీప.. తనకు రాజకీయ అనుభవం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు.

 తనకు దిశానిర్దేశం చేసే వారు కూడా ఎవరూ లేరన్నారు. తనపై కొందరు అశ్లీల కామెంట్లు చేస్తున్నారని దీప ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి కామెంట్లు పోస్టు చేయడం ఆపితేనే వారు రాజకీయాల్లో కొనసాగగలుగుతారని పేర్కొన్నారు. రాజకీయాలు తనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయని దీప ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News