Nara Lokesh: తుగ్లక్ పాలనకిది మచ్చుతునక: నారా లోకేశ్

  • ఇసుక దొరక్క నిర్మాణ పనులు ఆగిపోయాయంటూ ట్వీట్
  • భవన నిర్మాణ కార్మికులు అప్పులు చేసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు
  • ట్రాక్టర్ ఇసుకను వైసీపీ వాళ్లు రూ.10 వేల వరకు అమ్ముకుంటున్నారని ఆరోపణ

రాష్ట్రంలో ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయని, 16 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనిలేక అష్టకష్టాలు పడుతున్నారని నారా లోకేశ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే తుగ్లక్ పాలనకు మచ్చుతునకలా ఉందంటూ ఎద్దేవా చేశారు. రెండు నెలల నుంచి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు రోజుకు రూ.500 చొప్పున రెండునెలల్లో రూ.30 వేల అప్పు చేసిన పరిస్థితి వచ్చిందని లోకేశ్ ట్వీట్ చేశారు.

 16 లక్షల మంది కార్మికులు రూ.4800 కోట్ల అప్పుల ఊబిలో చిక్కుకుపోతుంటే, వైసీపీ నేతలు రూ.1500కి దొరికే ట్రాక్టర్ ఇసుకను జగనన్న ఇసుక పేరుతో రూ.10 వేల వరకు అమ్ముకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల మేతను చూసి వైసీపీ అధినేత మురిసిపోతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు.

More Telugu News