MSK Prasad: తనపై వస్తున్న విమర్శలకు దీటుగా బదులిచ్చిన చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

  • వరల్డ్ కప్ ఓటమితో సెలెక్షన్ కమిటీపై విమర్శలు చేస్తున్న మాజీ క్రికెటర్లు
  • సెలెక్టర్లకు అంతర్జాతీయ అనుభవంలేదన్న మాజీలు
  • అనుభవమే కొలమానం కాదన్న ఎమ్మెస్కే

వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి అనంతరం సెలెక్షన్ కమిటీ పనితీరుపై మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జట్టుకు సంబంధించిన విషయాల్లో విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిల ఆధిపత్యాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం సెలెక్షన్ కమిటీకి లేవని సునీల్ గవాస్కర్ కాస్తంత ఘాటుగానే విమర్శించాడు. టీమిండియా సెలెక్షన్ కమిటీలో ఉన్నవాళ్లందరూ కలిసి ఆడింది 13 టెస్టులేనంటూ కూడా మరికొందరు ఎద్దేవా చేశారు. దీనిపై చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్రంగా స్పందించాడు.

అంతర్జాతీయ అనుభవమే కొలమానం అయితే, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎడ్ స్మిత్ తన కెరీర్ లో ఒక్క టెస్టు మాత్రమే ఆడారని, ఆస్ట్రేలియా క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ట్రెవర్ హాన్స్ 13 ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఆయన ఆడింది 7 టెస్టులు మాత్రమేనని ఎమ్మెస్కే వివరించాడు. కానీ, 128 టెస్టులు, 244 వన్డేలు ఆడిన మార్క్ వా, 87 టెస్టులు, 74 వన్డేలు ఆడిన గ్రెగ్ చాపెల్ వంటివాళ్లు కూడా ఏడు టెస్టులాడిన ట్రెవర్ హాన్స్ కిందే పనిచేస్తున్నారన్న విషయం విమర్శకులు గుర్తెరగాలని పేర్కొన్నాడు.

భారత క్రికెట్ రంగంలో రాజ్ సింగ్ దుంగార్పూర్ ఎంతో పేరున్న వ్యక్తి అని, ఆయన తన కెరీర్ లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని, ఆయన హయాంలోనే దేశం గర్వించదగ్గ మహోన్నత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ఎంపిక చేశారని ఎమ్మెస్కే తెలిపారు.

తాము అంతర్జాతీయంగా ఎక్కువ మ్యాచ్ లు ఆడకపోయినా, ప్రస్తుత సెలక్షన్ కమిటీలో సభ్యులంతా 477 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడామని, సెలెక్టర్లుగా బాధ్యతలు అందుకున్నాక మరో 220 మ్యాచ్ లు ప్రత్యక్షంగా వీక్షించామని చెప్పారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడానికి మా అనుభవం సరిపోదని భావిస్తున్నారా? అంటూ ఎమ్మెస్కే మండిపడ్డాడు.

జట్టులో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన వారు సెలెక్టర్లపైన కూడా పెత్తనం చేస్తారని భావించడం పెద్ద భ్రమ అని తనపై వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. ఒకవేళ అదే నిజమైతే అంతర్జాతీయంగా అపారమైన అనుభవం ఉన్నవాళ్లనే సెలెక్టర్లుగా, సహాయసిబ్బందిగా ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఇది సరైన విధానం అనుకోవడంలేదని ఎమ్మెస్కే స్పష్టం చేశారు.

More Telugu News