KB Laxmi: ప్రముఖ రచయిత్రి కె.బి.లక్ష్మి కన్నుమూత

  • కంచిలోని అత్తివరదర్ పెరుమాల్‌ దర్శనం కోసం వెళ్లిన లక్ష్మి
  • తిరుగు ప్రయాణంలో రేణిగుంట సమీపంలో గుండెపోటుతో మృతి
  • 2003లో రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం

ప్రముఖ రచయిత్రి , పాత్రికేయురాలు డాక్టర్ కె.బి.లక్ష్మి (కొల్లూరి భాగ్యలక్ష్మి -70) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. లక్ష్మి సహా 50 మందితో కూడిన బృందం ఇటీవల కంచిలోని అత్తివరదర్ పెరుమాల్‌ దర్శనం కోసం హైదరాబాద్‌ నుంచి రైలులో వెళ్లింది. పెరుమాల్ దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో సోమవారం అరక్కోణం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడి నుంచి చెన్నై-ఎగ్మోర్‌ రైల్లో హైదరాబాద్‌కు బయలుదేరింది. రాత్రి 8 గంటల సమయంలో రైలు రేణిగుంట సమీపానికి రాగానే లక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే మృతి చెందారు. లక్ష్మి మృతదేహాన్ని అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు.

కేబీ లక్ష్మి బహుముఖ ప్రజ్ఞాశాలి. రేడియో వ్యాఖ్యాతగా, వక్తగా, విమర్శకురాలిగా, కథా రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. పాత్రికేయురాలిగా 'ఈనాడు' గ్రూపుకు చెందిన విపుల, చతుర పత్రికలలో కెరీర్ ప్రారంభించి, అక్కడే రిటైర్ అయ్యారు. ‘మనసున మనసై’, ‘జూకామల్లి’ కథల సంపుటాలు వెలువరించారు. ‘వీక్షణం’, ‘గమనం’ కవితా సంకలనాలు కవయిత్రిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 2003లో రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రిగా పరస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ కేబీ లక్ష్మికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో నివసిస్తుండగా, కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు.

More Telugu News